సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాలి…
డాక్టర్ బి.రవీంద్ర నాయక్ ,డైరెక్టర్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ…
కాకతీయ, వరంగల్ సిటీ : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, అగ్రం పహాడ్ జాతర వెళ్లే భక్తులకు ఎలాంటి వైద్య పరమైన సహాయం అవసరమైనా అందించడం బాధ్యత అని, చికిత్సకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ బి.రవీంద్ర నాయక్ సూచించారు. గురువారం ఆయన జాతర కోసం ప్రత్యేకంగా కటాక్ష పూర్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరమును సందర్శించి ఆత్మకూరు వైద్యాధికారి డాక్టర్ స్పందనను క్యాంపుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మేడారం ప్రధాన రహదారిలో ఉన్న ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24/7 సేవలు అందించాలని, 108 ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ తో సమన్వయంతో పనిచేయాలన్నారు. హనుమకొండ జిల్లాలోని మినీ సమ్మక్క సారలమ్మ జాతరతో పాటు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన 22వైద్య శిబిరాలలో భక్తులకు మెరుగైన సేవలందించాలన్నారు. స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు డాక్టర్ స్పందన తెలియజేశారు.
అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య అగ్రం పహాడ్ జాతరను సందర్శించి తగు సూచనలు అందించినట్లు అలాగే నేడు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఆత్మకూరు మండలంలోని 6వైద్య శిబిరాలను సందర్శించినట్లు డైరెక్టర్ కు తెలియజేశారు. డిఎం అండ్ హెచ్ఓ ఆదేశాల మేరకు జాతరలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి భక్తులకు సూచనలు ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించినట్లు, అలాగే అగ్రంపాడు ప్రధాన వైద్యశాలలో 10పడకలు, అన్ని అత్యవసర మందులతో పాటు ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఆరోగ్య ప్రదర్శనశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డాక్టర్ నర్సింగరావు, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ టీ.మాధవరెడ్డి, జునేడి, హెచ్ఈఓ కే.సంపత్ లు ఏర్పాట్లలో పాల్గొన్నారు.


