గిరిజన గర్భిణీలకు మెరుగైన మాతృసేవలు
టిఫ్ఫా స్కాన్ సేవలు అందుబాటులోకి
డీసీహెచ్ ఎస్ డాక్టర్ రవి బాబు
కాకతీయ, కొత్తగూడెం : గిరిజన ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు టిఫ్ఫా స్కాన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవి బాబు తెలిపారు. తల్లి శిశువు భద్రతను మెరుగుపరచడంలో ఇవి కీలకమని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని ఏజెన్సీ ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులను నియమించి ఆధునిక స్కానింగ్ సేవలను ప్రారంభించారు. గతంలో భద్రాచలం, ఎల్లందు, పాల్వంచ, మణుగూరు ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా, అశ్వారావుపేట, చర్ల ప్రాంతాల్లో రేడియాలజిస్ట్‌ల కొరత ఉండేది. జిల్లా పరిపాలన చొరవతో ఈ లోటును పూర్తిగా అధిగమించారు.
మాతృసేవల బలోపేతంపై దృష్టి
గర్భంలోని శిశువు అభివృద్ధిని ముందుగానే గుర్తించేందుకు టిఫ్ఫా స్కాన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పుట్టుకలో వచ్చే లోపాలను ముందే గుర్తించి సరైన వైద్య నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రేడియాలజీ సేవలు అందుబాటులోకి రావడం విశేషమన్నారు. ఈ సౌకర్యంతో గర్భిణీలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిందన్నారు. ప్రయాణ సమయం, ఖర్చులు తగ్గుతున్నాయని తెలిపారు. పేద గిరిజన గర్భిణీలకు ఈ సేవలు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని డాక్టర్ రవి బాబు తెలిపారు.


