- టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి
- ఎంజీబీఎస్, జేబీఎస్ సందర్శన
- ప్రయాణికులకు కల్పిస్తున్న వసతులపై ఆరా..
కాకతీయ, తెలంగాణ బ్యూరో : టీజీఎస్ఆర్టీసీ నూతన వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్ లను పరిశీలించారు. ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. శుభ్రత, తాగునీటి సౌకర్యం, కుర్చీలు, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను ప్రత్యేకంగా సమీక్షించి, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే ఆయా బస్ స్టేషన్ల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్లను పరిశీలించారు. లాగిస్టిక్స్ కౌంటర్లను సందర్శించారు.
అనంతరం నాగి రెడ్డి స్వయంగా కొన్ని బస్సుల్లో ఎక్కి వాటి శుభ్రత, సీటింగ్ సౌకర్యాలు, సాంకేతిక పరిస్థితులను సమీక్షించారు. ప్రయాణికులతో ముచ్చటించారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు సౌకర్యాల కల్పన విషయంలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ప్రయాణికుల సౌకర్యాలను మరింత విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఈడీలు ముని శేఖర్, వెంకన్న, ఖుస్రోషా ఖాన్, సిటీఎం కమర్షియల్ శ్రీధర్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.


