
- బార్‌లా.. తెరుచుకుంటయ్
- తెల్లవారుజామునే మద్యం దుకాణాలు ఓపెన్
- మచ్చుకైనా కానరాని ఫుడ్ సేఫ్టీ నిబంధనలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో :

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు మధ్యంపాలు చేస్తూ విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. అబ్కారీశాఖ అధికారులు మాత్రం మొత్తం మాకు తెలిసే జరుగుతుంది అన్న తీరున వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోని బస్టాండ్, ప్రధాన రహదారులు, పలు చౌరస్తా కూడళ్ల సమీపంలో ఏర్పాటు చేసిన వైన్స్, బార్లలో రాత్రి, పగలు తేడాలేకుండా మధ్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ అబ్కారీ, పోలిస్ శాఖ అధికారులకు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
బార్లను తలపిస్తున్న పర్మిట్ రూంలు..
బార్, వైన్స్ నిర్వాహకులు అబ్కారీ (ఎక్సైజ్) శాఖ నిబంధనల పాటిస్తూ మద్యం విక్రయాలు జరపాల్సి ఉంటుంది. అబ్కారీశాఖ నిబంధనల ప్రకారం.. మద్యం విక్రయాలు వైన్స్ అయితే ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, బార్లలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మాత్రమే విక్రయాలు నిర్వహించాలి. అలాగే మద్యం షాపుల్లో ఏర్పాటు చేసిన పర్మిట్ రూములు నిర్ణీత కొలతల ప్రకారం చిన్న గదిలో మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది, ఇందులో ఎలాంటి బెంచీలు గానీ, టేబుళ్లు గానీ వేయకుండా నిర్వహించాలి. కేవలం గ్లాసులు, మందు సీసాలు పెట్టుకునేందుకు మాత్రమే వాల్ చెక్కలు ఏర్పాటు చేయాలి. కానీ ఒక్కో వైన్‌షాపు యజమాని పర్మిట్ రూంలలో బెంచీలు, టేబుళ్లు వేసి యథేచ్చగా సిట్టింగులను నడిపిస్తున్నా ఎక్సైజ్ శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో వైన్ షాపు పర్మిట్ రూంలు బార్లను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నిబంధనలకు విస్మరిస్తూ సిట్టింగ్ లు ఏర్పాటు చేయడం వలన మద్యం మత్తులో గొడవలు నిత్యకృతంగా మారుతున్నాయి. ఈ విషయాన్ని బయటకు పోక్కకుండా నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఇటువంటి పలు ఘటనలు ఇటీవల ఉమ్మడి జిల్లా పరిధిలో చోటుచేసుకోవడం గమనార్హం. బార్లను తలపిస్తున్న పర్మిట్ రూంలు..
ఇష్టారీతిన నిర్వహణ
జిల్లా కేంద్రంలోని కొన్ని వైన్స్, బార్ల నిర్వాహకులు సమయపాలన లేకండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. బార్, వైన్స్ లలో ఫుడ్ సేఫ్టీ అథారిటీ (FSSAI) నిబంధనలు మేరకు నిర్వహణ కొనసాగించాల్సి ఉన్న అవి మచ్చుకు కూడా అమలవుతున్న పరిస్థితి కనిపించడంలేదు. ఫుడ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల మేరకు శుభ్రత,హైజీన్ ప్రమాణాలు పాటించాలి. వంటగది, సర్వ్ ప్రాంతం శుభ్రంగా ఉండాలి. సిబ్బంది హ్యాండ్ వాష్, గ్లౌజ్, కెప్ వాడాలి. వంట పరికరాలు శుభ్రంగా ఉండాలి. మత్తులో వినియోగదారులకు సరఫరా చేయకూడదు, కీటకనాశకాల నియంత్రణ ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలు ఏవీ కూడా ఇక్కడ అమలవుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనంగా ఇటీవల జిల్లా కేంద్రంలోని రెండు బార్ అండ్ రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదనే విషయాలు వెలుగు చూడడంతో నిర్వాహకులకు నోటీసులు సైతం జారీ చేశారు.
షరా మామూలుగానే..
బార్ అండ్ రెస్టారెంట్, వైన్స్ నిర్వహణ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించిన అవి కేవలం నోటిసులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. నామమాత్రపు నోటిసులకు అలవాటుపడిన నిర్వాహకులు తనిఖీల అనంతరం షరా మామూలుగానే నిర్వహణ కొనసాగిస్తున్నారు. అయితే ఇంతలా వైన్స్, బార్ల నిర్వహణలో ఎక్సైంజ్, పుట్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ మధ్యం విక్రయాలు కొనసాగిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా సమయపాలన పాటించకుండా మధ్యం విక్రయాలు జరుపుతున్న వైన్స్, బార్ల నిర్వహణ తీరుపై ఎక్సైజ్‌శాఖ అధికారులు చర్యల విషయంలో మౌనం కనబరుస్తుండటంపై అనుమానులు వ్యక్తమవుతున్నాయి. మరీ ఇప్పటికైనా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.


