డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి”
సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయి
డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తలు తప్పనిసరి
నకిలీ కరెన్సీ గుర్తింపుపై శిక్షణ
గౌస్ ఆలం, కరీంనగర్ పోలీస్ కమిషనర్
కాకతీయ, కరీంనగర్ : డిజిటల్ లావాదేవీలు పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయని, వాటిని ఎదుర్కోవాలంటే పోలీసులు పూర్తి స్థాయి అప్రమత్తతతో వ్యవహరించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని ‘అస్త్ర’ హాలులో మంగళవారం డిజిటల్ లావాదేవీలు, సైబర్ నేరాలు, నకిలీ కరెన్సీ గుర్తింపుపై అవగాహన సదస్సును నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బందిలో సైబర్ మోసాలపై అవగాహన పెంచి, బాధితులకు వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సదస్సును ఉద్దేశించి సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ మోసాలను గుర్తించడంలో పోలీసు అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
డిజిటల్ మోసాలపై శిక్షణ
ఇటీవల విస్తరిస్తున్న డిజిటల్ అరెస్ట్ మోసాలు, లాటరీ పేరుతో జరిగే మోసాలు, అనుమానాస్పద లింక్‌ల ద్వారా ఖాతాలు ఖాళీ చేసే ఘటనలపై సవివరంగా వివరించారు. యూపీఐ, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, తక్షణ చెల్లింపు సేవల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టత ఇచ్చారు. యూపీఐ పిన్ను ఎవరికీ చెప్పకూడదని, ఫోన్ కాల్స్ లేదా సందేశాల ద్వారా వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచించారు. డిజిటల్ లావాదేవీల్లో మోసపోయినప్పుడు ఫిర్యాదు చేసే విధానం, ఆర్బీఐ అంబుడ్స్‌మన్ సేవల వినియోగంపై అవగాహన కల్పించారు. అసలు కరెన్సీ నోట్లలో ఉండే భద్రతా లక్షణాలు, నకిలీ నోట్లను గుర్తించే విధానం, నోట్ల మార్పిడి నిబంధనలపై పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. నగదు రహిత లావాదేవీల ప్రయోజనాలు, సైబర్ భద్రత పాటించాల్సిన మార్గాలను ప్రాయోగికంగా వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) వెంకటరమణ, ఆర్బీఐ అధికారులు, ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ మేనేజర్ సత్యజిత్ ఘోష్, మేనేజర్ ఖాదర్ హుస్సేన్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



