సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
తొర్రూరు ఎస్సై ఉపేందర్
కాకతీయ, తొర్రూర్ : తొర్రూర్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ఐక్యూఏసీ (ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్) విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రాములు అధ్యక్షత వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై ఉపేందర్ పాల్గొని విద్యార్థులకు, అధ్యాపకులకు సైబర్ నేరాలపై కీలక సూచనలు చేశారు. ఆన్‌లైన్ మోసాలపై ముందుగా అవగాహన కలిగి ఉంటేనే వాటిని అరికట్టగలమని ఆయన తెలిపారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు భయపడి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీలు వెల్లడించకూడదని హెచ్చరించారు. వివిధ రకాల సైబర్ మోసాలను ఉదాహరణలతో వివరించిన ఎస్సై ఉపేందర్, ‘డిజిటల్ అరెస్ట్’ అనే వ్యవస్థ అసలు లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రాములు మాట్లాడుతూ… సైబర్ నేరాలపై ముఖ్యంగా యువత పూర్తి అవగాహన కలిగి ఉండి, ఇతరులను కూడా చైతన్యపరచాలని సూచించారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ వై. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ… మొబైల్ ఫోన్లలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకులను నిర్ధారించుకోకుండా ఓపెన్ చేయడం వల్ల మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిజమైనవని నిర్ధారించుకున్న తర్వాతే లింకులను తెరవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు డాక్టర్ శాంతికుమార్, డాక్టర్ సుజాత, డాక్టర్ పార్వతి, డాక్టర్ వాల్యా, డాక్టర్ అంజు ఆరా, డాక్టర్ సునీల్‌తో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


