సీనియర్లకు మొండి చెయ్యి !
పరకాల కాంగ్రెస్‌లో హస్తవ్యస్థం !
పార్టీలో చేరిన కొత్తవాళ్లకే ఎన్నికల్లో పోటీకి చాన్స్ !
వార్డు మెంబర్, సర్పంచ్ అభ్యర్థులుగా అవకాశం
ఎమ్మెల్యే రేవూరి తీరుపై సీనియర్లు గరంగరం
అనుచరులనే అందలమెక్కిస్తున్నారని ఆగ్రహం
తమదారి తాము చూసుకుంటున్న నాయకులు
అధికార పార్టీకి గుడ్ బై చెప్పి ప్రతిపక్షంలోకి వెళ్తున్న వైనం
కాకతీయ, వరంగల్ బ్యూరో / పరకాల : పరకాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో కీలక స్థానాల్లో వ్యవహరిస్తున్న నాయకులు, ఉద్యమకారులు, అలాగే ఎమ్మెల్యే సొంత మండలానికి చెందిన గ్రామస్థాయి ప్రతినిధులు వరుసగా పార్టీ మార్చడం చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్ అభ్యర్థులు, మండల స్థాయి నేతలు, యూత్ నాయకులు, వివిధ కమిటీలకు చెందిన ప్రతినిధులు ప్రత్యర్థి పార్టీలో చేరడం హాట్ టాపిక్‌గా మారింది. తమను పార్టీ పట్టించుకోవడం లేదన్న భావన, నిర్ణయాల్లో ప్రమేయం లేకపోవడం, గ్రామ సమస్యలు పరిష్కారం కాకపోవడం, నాయకత్వం తమకు దూరమై పోయిందన్న అసంతృప్తి వలసలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. పల్లె అభివృద్ధి, కార్యకర్తల గౌరవం, స్థానిక నాయకుల మాటలకు విలువ ఇవ్వకపోవడం వంటి అంశాలు మార్పులకు కారణమవుతున్నాయి.
ప్రధాన నాయకులను చేజార్చుకుంటున్న ఎమ్మెల్యే రేవూరి..
పరకాల నియోజకవర్గంలో ముఖ్య నేతలు వరుసగా ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లిపోవడం ఎమ్మెల్యే రేవూరి నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా సొంత మండలంలోని గ్రామ ప్రతినిధులు కూడా వేరే పార్టీ వైపు అడుగులు వేయడం దీనిని మరింత హైలైట్ చేస్తోంది. సీనియర్ నాయకులు, ఉద్యమకాలం నుండి పరకాలకు సేవలందిస్తున్న కార్యకర్తలు కూడా ఈ మార్పుల్లో ఉండటంతో పార్టీ అంతర్గత పరిస్థితులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నాయకత్వం అందరికీ అందుబాటులో లేకపోవడం, అభిప్రాయాలను పట్టించుకోకపోవడం, నిర్ణయాల ప్రక్రియలో కార్యకర్తలకు స్థానం లేకపోవడం వంటి అంశాలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలనే ప్రత్యర్థి శిబిరాల వైపు నడిపిస్తున్నాయి. ఈ పరిణామాలు రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు పెద్ద సవాలుగా మారే అవకాశముంది.
గీసుగొండలో చిత్రవిచిత్రాలు..
పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలో పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర కలయిక ఏర్పడింది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి .. కొండా వర్గానికి చెందిన ప్రధాన నాయకులను తమతో కలుపుకోకపోవడంతో మండలంలో స్థానిక ఎన్నికల్లో విచిత్ర కలయిక ఎదురయింది. కొండా వర్గీయులు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ నాయకులతో కలిసి గ్రామంలోని సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులను పంచుకొని, స్థానిక ఎమ్మెల్యే వర్గీయుల అభ్యర్థులపై పోటీకి దిగడం గమనార్హం. ఇదే మండలంలోని మరియాపురం గ్రామంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల ముందు కొండా వర్గంలో తిరిగిన నాయకులకు స్థానిక ఎమ్మెల్యే సర్పంచ్, వర్డ్ అభ్యర్థులుగా ప్రతిపాదించడంతో.. మొదటి నుంచి ఎమ్మెల్యే వర్గంలో తిరిగినవారే వారిపై పోటీకి దిగడం కొసమెరుపు.
పరకాలలో కండువా మారుస్తున్న నాయకులు
ఈ పార్టీ మార్పులు పరకాల రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేలా కనిపిస్తున్నాయి. గ్రామస్థాయి నాయకులు, యువత, కమిటీ సభ్యులు వంటి పలువురు ఒకేసారి ప్రత్యర్థి పార్టీలో చేరడం రాబోయే ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఒక వైపు పార్టీలో అసంతృప్తి పెరుగుతుండగా, మరోవైపు ప్రత్యర్థి పార్టీల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో జరుగుతున్న ఈ వరుస పరిణామాలు మున్ముందు ఎటు దారితీస్తాయో వేచిచూడాల్సిందే.


