మొండి చేయి!
బడ్జెట్లో జిల్లాకు దక్కని ప్రాధాన్యం
ప్రత్యేక కేటాయింపుల ఊసే లేదు
4 జిల్లాలకు ఒక్క మెగా ప్రాజెక్టు లేదు
కాగితాలకే ప్రతిపాదనలు,ప్రణాళికలు పరిమితం
సాధారణ కేటాయింపులతోనే సర్దుబాటు
ఇద్దరు మంత్రులు ఉన్నా జిల్లాలకు కనిపించని ప్రాధాన్యం
సమస్యలు యథాతథం.. ప్రణాళికలు కనిపించని పరిస్థితి
పరిశ్రమలు, ఐటీ అవకాశాలు లేక యువతలో నిరాశ
కాకతీయ, కరీంనగర్ బ్యూరో: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026–27 భారీ సంఖ్యలతో ఆకట్టుకున్నప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలపై స్పష్టమైన ప్రాధాన్యం కనిపించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రూ. 3,24,234 కోట్ల వ్యయం, మూలధన వ్యయం రూ. 47,267 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లు ప్రకటించింది. వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ వంటి రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించినప్పటికీ పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు నేరుగా ఉపయోగపడే ఒక్క మెగా ప్రాజెక్టు కూడా లేకపోవడం అసంతృప్తిని పెంచుతోంది. సాగునీటి విస్తరణ, కాలువల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, పరిశ్రమల ఏర్పాటు, ఐటీ కేంద్రాల అభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాల్లో ఈ 4 జిల్లాలకు ప్రత్యేక ప్రణాళికలు కనిపించలేదు. బడ్జెట్లో ఉన్న పెద్ద సంఖ్యల మధ్య ఈ ప్రాంతాలు సాధారణ కేటాయింపుల్లో కలిసిపోయినట్టుగా మారాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇద్దరు మంత్రులు ఉన్నా ప్రయోజనం కనిపించలేదు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన దుద్దిళ్ల శ్రీదర్ బాబు, పోన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ జిల్లాకు తగిన స్థాయిలో ప్రయోజనం తీసుకురాలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నిధులు కేటాయించినప్పటికీ సిరిసిల్ల చేనేత కార్మికులు, జగిత్యాల–పెద్దపల్లి రైతులు, బీసీ వృత్తిదారులు, గిరిజన తండాల సమస్యలకు ప్రత్యేక చర్యలు కనిపించలేదు. పరిశ్రమలు, ఐటీ రంగాల్లో అవకాశాలు లేకపోవడం యువతలో నిరాశను మరింత పెంచుతోంది. పెద్దపల్లిలో పరిశ్రమల విస్తరణ, జగిత్యాలలో సాగునీటి సమస్యలు, రాజన్న సిరిసిల్లలో చేనేత సంక్షోభం, కరీంనగర్ నగరాభివృద్ధి వంటి అంశాలు బడ్జెట్లో ఎక్కడా ప్రతిబింబించలేదు. చేనేతకు నిధులు ఉన్నప్పటికీ సిరిసిల్లకు ప్రత్యేక ప్యాకేజీ లేదు. వ్యవసాయానికి కేటాయింపులు ఉన్నప్పటికీ జగిత్యాల రైతులకు లక్ష్యిత ప్రణాళికలు కనిపించలేదు. పట్టణాభివృద్ధి నిధులు ఉన్నప్పటికీ కరీంనగర్‌కు స్పష్టమైన దిశ చూపలేదు.

పథకాలు ఉన్నా.. ప్రత్యక్ష లాభం లేదు
రైతు భరోసా రూ. 18,000 కోట్లు, చేయూత రూ. 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లు రూ. 5,500 కోట్లు, విద్యుత్ సబ్సిడీ రూ. 14,000 కోట్లు, స్కాలర్షిప్లు రూ. 4,343 కోట్లు వంటి పథకాల ద్వారా పరోక్ష ప్రయోజనం ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ ఇవి రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే సాధారణ పథకాలే గానీ ఈ జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వలేకపోతున్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ ప్రాంతం బడ్జెట్లో స్పష్టమైన ప్రాధాన్యం లేకుండా మిగిలిపోయిందనే విమర్శలు బలపడుతున్నాయి. భారీ సంఖ్యలతో ఉన్న బడ్జెట్లో లక్ష్యిత ప్రణాళికలు లేకపోవడం ఈ ప్రాంత ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఇద్దరు మంత్రులు ఉన్నా జిల్లాకు తగిన స్థాయిలో నిధులు రాకపోవడం రాబోయే రోజుల్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.


