పురపాలక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
షెడ్యూల్ విడుదలకు ఎన్నికల సంఘం సన్నాహాలు
క్రిటికల్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత
వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు తప్పనిసరి
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని
వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
కాకతీయ, కరీంనగర్ : పురపాలక ఎన్నికల నిర్వహణకు జిల్లాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
త్వరలో ఎన్నికల షెడ్యూల్..
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రతా సిబ్బందిని నియమించాలని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం బయట సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సామాజిక విఘాతం కలిగించే వ్యక్తులపై బైండోవర్ చర్యలు చేపట్టాలని సూచించారు.
డ్రోన్లతో పర్యవేక్షణ.. సిబ్బందికి శిక్షణ ఏర్పాట్లు
ఎన్నికల ప్రచారం పర్యవేక్షణకు, పోలింగ్–కౌంటింగ్ కేంద్రాల్లో సాధ్యమైన మేర డ్రోన్ల వినియోగం చేయాలని తెలిపారు. ఎన్నికల విధులకు సంబంధించి మాస్టర్ ట్రైనర్లు జిల్లాలకు చేరుకుంటారని, సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతుల వివరాలను టి–పోల్‌లో నమోదు చేసినట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది, సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు తదితర ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్, బయట సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని, నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు.


