నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌పై జాగ్రత్తగా ఉండాలి
అధికారుల పేరిట మోసాలకు ప్రయత్నం
నగరపాలక సంస్థ అధికారుల హెచ్చరిక
కాకతీయ, ఖమ్మం బ్యూరో : మున్సిపల్ కమిషనర్ పేరిట నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్ సృష్టించి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని నగరపాలక సంస్థ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ కార్పొరేషన్ ఆఫీస్ పేరుతో ట్రుకలర్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతా సృష్టించబడినట్లు తెలిపారు. ఈ అకౌంట్ ద్వారా అపరిచిత వ్యక్తులు ఫోన్ లేదా మెసేజ్ చేసి అత్యవసరమని చెప్పి డబ్బులు అడిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ వ్యక్తిగతంగా లేదా అధికారికంగా సోషల్ మీడియా, ఫోన్ ద్వారా డబ్బులు అడగరని స్పష్టం చేశారు. ఎవరైనా అధికారి పేరుతో డబ్బులు అడిగితే స్పందించవద్దని సూచించారు. ఆన్‌లైన్ పేమెంట్స్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


