కాకతీయ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ మండలం జక్కలొద్ది లోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజులతో కలసి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల భవనంలోని డార్మెంటరీ, భోజనశాల, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే, ఎంపీ . జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అలాగే సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. హాస్టల్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉండే విధంగా కళాశాల ప్రిన్సిపల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టే విధంగా బోధన పద్ధతులను రూపొందించుకోవాలని అధ్యాపకులకు కలెక్టర్ సత్య శారద సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఖిలా వరంగల్ తహసిల్దార్ నాగేశ్వరరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.


