అప్రమత్తంగా ఉండాలి
ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా
ఆశ్రమ జూనియర్ కళాశాల సందర్శన
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని ఎస్‌ఎస్ తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ జూనియర్ కళాశాలను పీఓ చిత్ర మిశ్రా సందర్శించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ప్రిన్సిపాల్, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. ఆశ్రమ జూనియర్ కళాశాల తాడ్వాయి, జగ్గన్నపేట పరీక్షా కేంద్రాల్లో పరీక్షా ప్యాడ్‌లు, స్టేషనరీ కిట్‌ల కొరతను గుర్తించి, తక్షణమే పరీక్షా ప్యాడ్‌లు, స్టేషనరీ కిట్‌లు, ట్రావెలింగ్ అలవెన్స్‌లను సరఫరా చేశారు. ప్రిన్సిపాల్‌లు, సెంటర్ ఇన్‌ఛార్జ్‌లు, ఏఎన్‌ఎమ్‌లకు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, ముఖ్యంగా పరీక్షల సమయంలో నిర్జలీకరణం వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కళాశాల భవనానికి సంబంధించిన మరమ్మత్తులు, గ్రిల్ అవసరాలను అంచనా వేసి, ఈ ప్రాంతంలో కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారు.


