ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి
విద్యార్థుల ప్రతిభే భవిష్యత్‌కు బలం
పెండింగ్ పనులపై కలెక్టర్ సీరియస్
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో రాజీ లేకుండా ముందుకు సాగాలని, ఫలితాల్లో మోడల్‌గా నిలిచేలా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. గురువారం చిగురుమామిడి మండలంలోని జడ్‌పిహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ పాఠశాల పరిసరాలను సమగ్రంగా పరిశీలించి విద్యా పరిస్థితులపై అధికారులను నిలదీశారు. పాఠశాల విస్తీర్ణం, విద్యార్థుల సంఖ్య, బోధన స్థాయి, వసతుల పరిస్థితి వంటి అంశాలపై వివరణ కోరుతూ స్పష్టమైన సమాచారం తీసుకున్నారు. అనంతరం ముల్కనూర్ గ్రామంలోని మోడల్ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్, విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, పరీక్షల సిద్ధత, వసతులపై ప్రశ్నించారు. పాఠశాల భవన సముదాయం, పరిసరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్, ఎలాంటి పెండింగ్ పనులు ఉన్నా వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ముల్కనూర్ మోడల్ స్కూల్ ఫలితాల్లో సరికొత్త చరిత్ర సృష్టించాలని జిల్లాకు ఆదర్శంగా నిలవాలని సూచిస్తూ విద్యార్థులు కష్టపడి చదివి అగ్రస్థానాల్లో నిలవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల ప్రతిభే రాష్ట్ర భవిష్యత్తుకు బలం అని పేర్కొంటూ ప్రతి ఒక్కరు లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఎంపీడీవో విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


