కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీట
మూడు మేయర్ పదవులు, 38 ఛైర్‌పర్సన్ పదవులు బీసీలకు రిజర్వ్
జీహెచ్ ఎంసీలో 122 సీట్లు కేటాయింపు
మిగతా 9 మున్సిపల్ కార్పొరేషన్లలోనూ గణనీయమైన ప్రాధాన్యం
ఎస్టీ, ఎస్సీలకన్నా రెట్టింపుగా రిజర్వుడు
పట్టణాల్లో రెండు సామాజిక వర్గాల జనాభా తక్కువే
తక్కువ సీట్ల కేటాయింపునకు అదే ప్రధాన కారణం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నట్లు సంకేతాలు వెలువడుతున్న నేపత్యంలో రిజర్వేషన్ల కేటాయింపులు ప్రక్రియ పూర్తయింది. బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కేటాయింపులు రాష్ట్ర పట్టణ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 300 వార్డుల్లో 122 సీట్లను బీసీలకు కేటాయించారు. వీటిలో 61 సీట్లు బీసీ మహిళలకు రిజర్వ్ చేయడం గమనార్హం. జీహెచ్ ఎంసీలో బీసీలకు ఇంత భారీ సంఖ్యలో సీట్లు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మిగతా తొమ్మది కార్పోరేషన్లలోనూ..
రాష్ట్రంలోని మిగతా 9 మున్సిపల్ కార్పొరేషన్లలోనూ బీసీలకు గణనీయమైన ప్రాధాన్యం లభించింది. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మహబూబ్‌నగర్, నల్గొండ వంటి ప్రధాన పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన బీసీ కోటాను ఖరారు చేశారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 26, కరీంనగర్‌లో 25, నిజామాబాద్‌లో 24 బీసీ సీట్లు కేటాయించారు. ఖమ్మం, వరంగల్, మంచిర్యాల కార్పొరేషన్లలో బీసీలకు 20 సీట్లు చొప్పున దక్కాయి. నల్గొండ, రామగుండం కార్పొరేషన్లలో 16 సీట్లు లభించగా, కొత్తగూడెంలో మాత్రం బీసీలకు కేవలం 7 సీట్లు మాత్రమే రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ రిజర్వేషన్ కేటాయింపులు కేవలం వార్డులకే పరిమితం కాలేదు. మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లలో 3 మేయర్ పదవులను బీసీలకు కేటాయించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 121 మున్సిపాలిటీల్లో 38 ఛైర్‌పర్సన్ పదవులను బీసీలకు రిజర్వ్ చేశారు. దీంతో పట్టణ పాలనలో బీసీల రాజకీయ ప్రాధాన్యం మరింత పెరగనుంది.
ఎస్సీ, ఎస్టీలకు తక్కువ వెనుక కారణం ఇదే..!
జీహెచ్ ఎంసీలో ఎస్పీలకు23, ఎస్టీలకు కేవలం 5 సీట్లే దక్కాయి. పూర్తిగా 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ రిజర్వేషన్లు జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో బీసీల ఆధిపత్యాన్ని ఈలెక్కలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. 2011 జనగణన ఆధారంగా ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్లు ఖరారు చేసినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో వారి జనాభా తక్కువగా ఉండటంతో ఆ వాటాను సర్దుబాటు చేస్తూ ఈ దఫా బీసీ రిజర్వేషన్లను పెంచినట్లు తెలుస్తోంది. మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లలో బీసీలకు 296 సీట్లు, ఎస్సీలకు 117, ఎస్టీలకు 27 సీట్లు కేటాయించారు. ఈ గణాంకాలే ఎస్టీ, ఎస్సీలతో పోలిస్తే బీసీలకే స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు చూపిస్తున్నాయి.
ఫిబ్రవరిలోనే మొదటివారంలోనే నోటిఫికేషన్
ఫిబ్రవరి 2026లో మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగియనుండటంతో ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. రిజర్వేషన్ల నోటిఫికేషన్ విడుదలతో ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది. ఈ పరిణామాలతో బీసీ ఓటు బ్యాంక్ కేంద్రంగా రాజకీయ సమీకరణలు మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలకు ఇది పెద్ద సవాలుగా మారనుండగా, ముఖ్యంగా జీహెచ్ ఎంసీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేయనున్నాయన్న అంచనాలు బలపడుతున్నాయి.


