విరాట్, రోహిత్‌కు బీసీసీఐ షాక్
ఏ ప్లస్ గ్రేడ్ రద్దు బీ కేటగిరీలోకి రో-కో !
సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కీలక మార్పులకు ప్లాన్ఏ
ర్యాకింగ్స్ రద్దు చేసేలా ప్రతిపాదనలు
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : ప్లేయర్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కొత్త విధానంలో ‘ఏ+’ గ్రేడ్‌ను పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ మార్పులు అమల్లోకి వస్తే టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ‘బీ’ గ్రేడ్‌కు మారే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
మూడు గ్రేడ్లకే పరిమితం చేయాలని ప్రతిపాదన
ప్రస్తుతం ఉన్న సెంట్రల్ కాంట్రాక్ట్ విధానంలో మార్పులు చేయాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. దీని ప్రకారం ఏ ప్లస్ గ్రేడ్ (రూ.7 కోట్లు)ను పూర్తిగా రద్దు చేయాలని సూచించింది. దాని స్థానంలో కేవలం ఏ, బీ,సీ అనే మూడు గ్రేడ్లు మాత్రమే కొనసాగించాలని పేర్కొంది. ఒకవేళ ఈ మార్పులు అమల్లోకి వస్తే ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే ఆడుతున్న విరాట్, కోహ్లిను బీ గ్రేడ్‌లోకి మార్చే అవకాశం ఉంది. అయితే వార్షిక వేతనం విషయంలోనూ ఈ మార్పులు వర్తిస్తాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై తదుపరి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్స్ అంటే ప్రతి సంవత్సరం భారత క్రికెటర్లకు ఇచ్చే రిటైనర్లు. వీటిని ఏ+,ఏ, బీ, సీ గ్రేడ్లుగా వర్గీకరిస్తారు. గ్రేడ్‌ను బట్టి వార్షిక ఫీజులు ఉంటాయి. A+ గ్రేడ్‌కు రూ.7 కోట్లు, A గ్రేడ్‌కు రూ.5 కోట్లు B గ్రేడ్‌కు రూ.3 కోట్లు, C గ్రేడ్‌కు రూ.1 కోటి ఉంటుంది. ఈ మొత్తం మ్యాచ్ ఫీజులతో పాటు అదనంగా ఉంటుంది.
మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు
ఇక ఇటీవల మహిళా క్రికెటర్లు, మ్యాచ్ అధికారుల ఫీజులను రెట్టింపుకన్నా ఎక్కువగా పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీనికి బోర్డు అపెక్స్ కౌన్సిల్ అధికారికంగా ఆమోదం తెలిపింది. సీనియర్ మహిళల దేశవాళీ వన్డే టోర్నమెంట్‌తో పాటు బహుళ రోజుల టోర్నీల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న ప్లేయర్లకు రోజుకు రూ.50 వేల మ్యాచ్ ఫీజు చెల్లించనున్నారు. ఇప్పటివరకు ఈ ఫీజు కేవలం రూ.20 వేలు మాత్రమే ఉండేది. ఇక రిజర్వ్ ఆటగాళ్లకు రోజుకు రూ.25 వేలు అందించనున్నారు. అంటే గతంతో పోలిస్తే రెట్టింపుకు పైగా పెరుగుదల నమోదైంది.


