కాకతీయ, కరీంనగర్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 9 జారీ చేయడం దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిందని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. శనివారం కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబురాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం బీసీల పక్షపాతం స్పష్టంగా చూపుతుందన్నారు. దేశంలో ఎక్కడా చేపట్టని విధంగా సమగ్ర కుల సర్వే నిర్వహించి, అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టి, తాజాగా జీవో జారీ చేయడం ద్వారా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన రాజ్యాధికారాన్ని కల్పిస్తోందని తెలిపారు. ఈ నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఎంతో ఉందని కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, మల్లికార్జున రాజేందర్, ఆకుల నరసన్న, మూల రవీందర్ రెడ్డి, జీఎస్ ఆనంద్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, యాగన్ల అనిల్ కుమార్, గుర్రం అశోక్ గౌడ్, అనంతుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


