బీసీ నేత జక్కని సంజయ్ ముందస్తు అరెస్టు
హుస్నాబాద్ సీఎం పర్యటన నేపథ్యంలో శంకరపట్నం పోలీసుల చర్య
కాకతీయ, కరీంనగర్ : హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎనుగుల రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకొని బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులను శంకరపట్నం మండల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్, మండల అధ్యక్షుడు బొంగోని అభిలాష్ గౌడ్, నాయకులు నామని పరంధాములు తదితరులను ఎస్సై శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం వారి గృహాల నుండి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌కు తరలించింది. ఈ చర్య కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టినట్లు సమాచారం.అరెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడిన జక్కని సంజయ్ కుమార్.జనాభాలో 56% బీసీలు ఉన్నా, స్వతంత్ర భారత్‌లో 78 ఏళ్లుగా అన్ని రంగాల్లో దోపిడికి గురవుతున్నారని విమర్శించారు.ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, బలహీన వర్గాలకు ఇంకా నిజమైన స్వాతంత్ర్యం రాలేదు. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం లభిస్తుంద అని తెలిపారు.అయితే బీసీల కోసం 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు కాలయాపన చేసి, చివరకు 17% మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు.బీసీలను నమ్మబలికి గొంతు కోశారు. ఈ మోసానికి తగిన గుణపాఠం స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా చెబుతాం అని హెచ్చరిస్తూ, అక్రమ అరెస్టులతో బీసీ ఉద్యమాలను ఆపలేరని తెలిపారు.బీసీల కోసం సమిధ కావడానికి, అవసరమైతే జీవితాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎంతటి నిర్బంధాలైనా ఎదుర్కొంటాం. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు జరిగేవరకు మా పోరాటాలు కొనసాగుతాయి అని జక్కని సంజయ్ స్పష్టం చేశారు.


