బయ్యారం జలదిగ్బంధం
మండలంలోని పలు రహదారులకు రాకపోకలు కట్
ప్రమాదకరంగా వాగులు వంకల్లో నీటి ప్రవాహం
కాకతీయ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో పలు వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. బయ్యారం పెద్ద చెరువుకు వచ్చే పంది పంపల వాగు అల్లిగూడెం వద్ద బ్రిడ్జిని అనుకొని వరద నీరు ప్రవహిస్తోంది. మసి వాగు సుద్దరేవు కొయ్యగూడెం ప్రాంతంలో ప్రమాదకరంగా వాగు ప్రవహిస్తోంది. దీంతో కంబాలపల్లి ప్రధాన రహదారి పైనుంచి ప్రవహించడంతో అధికారులు రోడ్డును బ్లాక్ చేశారు. అదేవిధంగా సత్యనారాయణపురంలో లెవెల్ బ్రిడ్జి పై నుంచి బయ్యారం చెరువు అలుగు మత్తడి అవుట్ ఫ్లో నీరు ప్రవహిస్తోంది. దీనితో రైతులు తమ పంట పొలాల పనులకు వెళ్లాలంటే బయ్యారం నుంచి కోట గడ్డ రోడ్డుకు రావల్సి వస్తుందని గ్రామస్థులు తెలిపారు. భారీ వర్షాలతో మహబూబాబాద్ నుంచి ఇల్లందు వెళ్లే రహదారిపై జండాల వాగు వద్ద లో లెవెల్ కల్వర్టుపై నీరు ప్రవహించడంతో జిల్లాల మధ్య రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రవహించడంతో రాక పోకలు అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహం తో ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా జిల్లా అధికారులు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాలతో,మండల రెవిన్యూ, పోలీస్ ,తహశీల్దార్. నాగరాజు, ఎస్ ఐ తిరుపతి, ఇరిగేషన్ ఏఇ అఖిల ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి, స్థానికులకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.


