బతుకమ్మ, దసరాకూ
టోల్ మినహాయించాలి
రాష్ట్ర ప్రజల సొమ్మును పక్క రాష్ట్ర టోల్ గేట్ల కోసం ఖర్చు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: సంక్రాంతి పండుగకు ఏపీకి వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టోల్ గేట్ల వద్ద ఫీజు మినహాయించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ స్పందించారు. దసరా, బతుకమ్మ పండుగ సమయంలో ట్రాఫిక్ కష్టాలు మీకు కనిపించ లేదా అని ఆయన్ను ప్రశ్నించారు. దసరా, బతుకమ్మ పండుగలకు కూడా టోల్ మినహాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని అన్ని టోల్ గేట్ల దగ్గర కూడా మినహాయింపు ఇవ్వాలని కోరారు. పండుగకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యాల కల్పించడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఈ నిర్ణయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ద్వంద్వ వైఖరి వివక్షను ప్రశ్నించారు. తెలంగాణ సరిహద్దు దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉండే చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద కూడా వసూళ్లు ఆపాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రానికి లేఖ రాయడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రాకు వెళ్లే రూట్‌లో టోల్ మినహాయింపు ఇచ్చినట్లే రాయలసీమకు వెళ్లే రూట్లలో ఎందుకు టోల్ మినహాయించలేదని దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణ పండుగలకు కూడా టోల్ మినహాయించాలని డిమాండ్ చేశారు. దసరా, బతుకమ్మ పండుగల సమయంలో మీకు ట్రాఫిక్ కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం కాకుండా, అందర్నీ సమానంగా చూడాలని సూచించారు.
సమానంగా చూడాలి
ఆంధ్ర ప్రయాణికులకు సదుపాయం కల్పించడం తప్పు కాదు, కానీ అదే సమయంలో తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపడం సమంజసం కాదు. పక్క రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిని గౌరవిస్తూనే, మన గడ్డ మీద పండుగలు చేసుకునే తెలంగాణ బిడ్డల అవసరాలను కూడా ప్రభుత్వం గుర్తించాలి. రాబోయే దసరా, బతుకమ్మ పండుగలకు కూడా ఇదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం ఇప్పుడే ప్రకటించాలి. పండుగ పూట కూడా ఓట్ల రాజకీయాలు చేయకుండా, అందరినీ సమానంగా చూడాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.


