బాసర ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దాలి
అభివృద్ది పనుల్లో రాజీ పడొద్దు
టీటీడీ తరహాలో ఏర్పాట్లు ఉండాలి
ఆలయ పవిత్రతకు భంగం కలగొద్దు
భక్తుల విశ్వాసాలను గౌరవించాలి
అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
బాసర ఆలయ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సమీక్ష
మాస్టర్ ప్లాన్‌ను వివరించిన అధికారులు
ఈనెల 6న బాసర ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన
కాకతీయ, తెలంగాణ బ్యూరో: బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎంకు అధికారులు వివరించారు. మాస్టర్ ప్లాన్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం. ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈనెల 6న బాసర ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.


