ధాన్యం కేటాయింపుకు బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి
ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : జిల్లాలోని రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపు చేసేందుకు బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చూపించడం తప్పనిసరి అని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో రైస్ మిల్లర్ల తో ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారంటీ, పెండింగ్ సిఎంఆర్ రైస్ డెలివరీపై అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మిల్లులకు సరఫరా చేసే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరి అని అన్నారు. రైస్ మిల్లులు అందజేసిన బ్యాంకు గ్యారంటీ ఆధారంగా కేటాయింపులు చేయడం జరుగుతుందని తెలిపారు. యాసంగి 2024-25 పంటకు సంబంధించి డిసెంబర్ 8 వరకు జిల్లాలో పెండింగ్ ఉన్న 12 శాతం సీఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో యాసంగి సీజన్ కు సంబంధించి 1,07,676 మెట్రిక్ టన్నులు సి.ఎం.ఆర్. రైస్ డెలివరీ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 95 వేల 100 మెట్రిక్ టన్నులు సిఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేశారని, పెండింగ్ 12 వేల 576 మెట్రిక్ టన్నులు పూర్తి చేయాలని అన్నారు. అనంతరం రైస్ మిల్లుల వారీగా పెండింగ్ ఉన్న సి.ఎం.ఆర్. రైస్ డెలివరీ, బ్యాంక్ గ్యారంటీపై అదనపు కలెక్టర్ సమీక్షించి, వెంటనే బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని, పెండింగ్ రైస్ డెలివరీ పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు బొమ్మ రాజేశ్వర రావు, మిల్లర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


