సమాజానికి ఆదర్శంగా బంజారాలు
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి
బంజారాలతో కలిసి నృత్యం చేసిన మంత్రి
కాకతీయ, సిద్దిపేట : బంజారా సమాజం ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్‌లో శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు రెండు వందల ఎనభై ఏడు సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. ఆయన ఆశీర్వాదాలతో అందరి సంక్షేమం కోసం పనిచేస్తానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బంజారాలు ఎక్కడ ఉన్నా ఒకే భాష, సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్ప విషయమని అన్నారు. వచ్చే సంవత్సరం నుంచి సంత్ సేవాలాల్ జయంతిని ఫిబ్రవరి పదిహేను రోజున హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మరింత ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. అసంపూర్తిగా ఉన్న బంజారా భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత తనదేనని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దుల మార్పులపై నిర్ణయం తీసుకునే సమయంలో హుస్నాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా కుల పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్యతో పాటు బంజారా నాయకులు పాల్గొన్నారు.


