కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్టును కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. చేవెళ్లలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా అరెస్టు చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే పయనిస్తోందంటూ విమర్శించారు. అరెస్టులతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచందర్ రావును పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.
బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వం చేయాల్సింది అరెస్టులు కాదని..సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. నిరంకుశ విధానాలు మానకపోతే ప్రజాక్షేత్రంలో మట్టి కరవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాగా జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ నేడు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మొయినాబాద్ వద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


