కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో వరద సహాయక చర్యల కోసం ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యం అవ్వడంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. ఆయన నేరుగా రక్షణశాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు బండి. రాష్ట్రంలో వరద తీవ్రత, సహాయక చర్యల ఆవశ్యకత గురించి వివరించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా మారిందని..ఇదే హెలికాప్టర్ల రాకకు ప్రధాన అడ్డంకిగా మారిందని రక్షణ శాఖ అధికారులు బండి సంజయ్ కు వివరించారు.
తెలంగాణ కోసం ఇప్పటికే 3 హెలికాప్టర్లను సిద్ధం చేశామని..అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో అవి బయలుదేరలేకపోతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్, కర్నాటకలోని బీదర్ వైమానిక స్థావరాలనుంచి హెలికాప్టర్లను పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని బండి సంజయ్ కు తెలిపారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ రాష్ట్రంలోని వరద తీవ్రతను అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఎస్సారెస్సీ, మానేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని..అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని తెలిపారు. ముంప్పు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహాయపడటానికి ఎన్డీఆర్ఎఫ్ బ్రుందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పరిస్థితుల ద్రుష్ట్యా వీలైనంత త్వరగా హెలికాప్టర్లను పంపించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు బండిసంజయ్.


