డ్రైనేజీలో బ్యాలెట్ పత్రాలు..నల్గొండ ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్
కాకతీయ, నల్గొండ : నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో డ్రైనేజీలో పోలైన బ్యాలెట్ పత్రాలు కనిపించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఎన్నికల సంఘం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ త్రిపాఠి స్టేజ్–2 రిటర్నింగ్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ అధికారిగా నల్గొండ ఆర్డీవోను నియమించారు. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగానే జరిగిందని ఎస్‌ఈసీ కార్యదర్శి తెలిపారు. అయితే ఎన్నికల సామాగ్రి భద్రతలో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. చిన్నకాపర్తి గ్రామంలోని డ్రైనేజీలో బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి కత్తెర గుర్తుకు పోలైన బ్యాలెట్ పత్రాలు కనిపించడం కలకలం రేపింది. దీనిపై బీఆర్ఎస్ అభ్యర్థి భిక్షం ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి 455 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, డ్రైనేజీలో బ్యాలెట్ పత్రాలు బయటపడటంతో రిగ్గింగ్ జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి చిన్నకాపర్తికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ ఎన్నికను రద్దు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేసింది.


