కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్..ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఆసుపత్రి భూమిపూజను తుళ్లూరు సమీపంలో బుధవారం ఉదయం సంస్థ ఛైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ నిర్వహించారు.
భూమి పూజ అనంతరం బాలక్రిష్ణ మాట్లాడుతూ.. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 2019లో శంకుస్థాపన జరిగిందన్నారు. తర్వాత కొన్ని అంధకార పరిస్థితులు ఏర్పాడ్డాయని తెలిపారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. దీంతో ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోయామని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నేత్రుత్వంలో పనులు చేపట్టినట్లు బాలక్రిష్ణ తెలిపారు. నేడు పండగ వాతావరణంలో పనులు ప్రారంభించినట్లు ఆయన వివరించారు.
క్యాన్సర్ ఆసుపత్రి లాభాపేక్షకోసం కాదని.. దాతల సహకారంతో ఆసుపత్రి నడుస్తుందని తెలిపారు. రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు. అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా దేశంలో మంచి పేరు సంపాదించుకుందని తెలిపారు. అత్యాధునిక క్యాన్సర్ వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలని మా తల్లి బసవతారకం కోరిక అని చెప్పారు. తన తల్లి కోరిక మేరకు అత్యున్నత వైద్యం అందిస్తున్నామని..అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రికి మొదటి విడతలో రూ. 750కోట్లు ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. మొదటి విడత పనులు 2028 వరకు పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని బాలక్రిష్ణ తెలిపారు.


