నిరుపయోగంగా బాల వికాస్ వాటర్ ప్లాంట్..
-లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేసిన పరిస్థితి
-పల్లె ప్రజలకు అందని సురక్షిత తాగునీరు
-తాగునీటి కోసం గ్రామస్థులకు తిప్పలు
కాకతీయ,శంకరపట్నం: గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన బాల వికాస్ వాటర్ ప్లాంట్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. శంకరపట్నం మండలంలోని వంకాయగూడెం గ్రామంలో ఆగస్టు 2023లో బాల వికాస్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఈ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొంతకాలం గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించిన ఈ ప్లాంట్, కాలక్రమేణా నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా పనికిరాని స్థితికి చేరింది. దీంతో గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందకుండా పోయింది. వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంతో గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని బాల వికాస్ యాజమాన్యానికి, ప్లాంట్ నిర్వాహకులకు పలుమార్లు తెలియజేసినా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామస్తులు పక్క గ్రామాల నుంచి తాగునీటి క్యాన్లు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో వాటర్ క్యాన్కు రూ.20 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వారు తెలిపారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బాల వికాస్ నిర్వాహకులపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకుని, నిలిచిపోయిన వాటర్ ప్లాంట్ను మళ్లీ ప్రారంభించి గ్రామ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.


