కాకతీయ, ములుగు: కాలేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ పేరుతో కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. మంగళవారం ములుగు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి పోస్ట్ ఆఫీస్ నుండి ర్యాలీగా వెళ్లి జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ తెలంగాణకు గుండెకాయని కాలేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, గోదావరి జలాలను ఆంధ్రకు తరలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు, మోడీలతో చేతులు కలిపారని,బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. గతంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలినప్పుడు, సుంకిసాలులో సైడ్ వాల్ కూలినప్పుడు కేంద్రం స్పందించలేదని, తెలంగాణ సమాజాన్ని మోసం చేసే కాంగ్రెస్ యత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో కొత్త రహదారి పనులు లేవని, ప్రస్తుతం రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమ్మర్‌లోనే యూరియా నిల్వలు సేకరించకపోవడంతో ఇప్పుడు సంక్షోభం వచ్చిందని, రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను నిలదీయాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి, వేములపల్లి బిక్షపతి, పోరిక విజయరాం నాయక్, పోమా నాయక్, భూక్య మురళి, కోగిల మహేష్, ఆకుతోట చంద్రమౌళి, గొర్రె సమ్మయ్య, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


