అయ్యప్ప స్వామి ప్రతిష్ట మహోత్సవం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ (ఎల్‌ఎండీ) గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు శుక్రవారం ఉదయం కన్నుల పండుగగా ప్రారంభమైంది. అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, పార్వతీదేవి, నవగ్రహ దేవతల విగ్రహాలు శాస్త్రోక్త పూజలతో గ్రామంలో భారీ ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అయ్యప్ప నామస్మరణతో భక్తజనాలు భారీగా తరలివచ్చి, దేవతా విగ్రహాల ఊరేగింపును తిలకిస్తూ ప్రాంతమంతా భక్తిరసంతో మార్మోగింది. ప్రతిష్ట మహోత్సవాల భాగంగా ఉదయం 8.30 గంటల నుంచి మంగళ వాయిద్యాలు, చతుర్వేద స్వస్తి, పుణ్యాహవాచనం, యజ్ఞశాల ప్రవేశం, నవగ్రహ,మాతృక,యోగినీ,వాస్తు,క్షేత్రపాలక,బ్రహ్మాది మండల దేవతా స్థాపనలు, అగ్ని ప్రతిష్ఠలు, హోమాలు వైభవంగా నిర్వహించారు.సాయంత్రం గణపతి, నవగ్రహ, ముఖ్య దేవతా మూర్తులకు మూల మంత్ర వాహనాలు, జలాధివాస కార్యక్రమాలు, హారతులు, తీర్థప్రసాద వినియోగం ఘనంగా జరగాయి.ప్రతిష్ట మహోత్సవాల కోసం హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ స్వామి ప్రత్యేకంగా మహాత్మా నగర్‌కు విచ్చేసి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.వేదమూర్తి బ్రహ్మశ్రీ జక్కి కృష్ణావధాని ఆధ్వర్యంలో వేదోక్త కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురుస్వామి కావేటి పరమేశ్వర స్వామి, ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప భక్తులు, మహాత్మా నగర్ గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మహోత్సవాల్లో పాల్గొనే భక్తులకు అన్నప్రసాదం, అల్పాహార ఏర్పాట్లు ప్రత్యేకంగా చేశారు.


