ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ
నీరుకుళ్ళలో భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వైభవం
మాలధారుల నామస్మరణతో మార్మోగిన గ్రామం
కాకతీయ, ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ళ గ్రామంలో హరిహరసుతుడు అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఆదివారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. సలేంద్ర వినోదాచార్యుల స్వగృహంలో ఏర్పాటు చేసిన ఈ మహా పడిపూజ కార్యక్రమం, పురోహితులు కరుణాకరాచార్య స్వామి వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
తొలుత గణపతి, మహాలక్ష్మి, అయ్యప్ప స్వాములకు దీపారాధనలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి పంచామృతాలు, పండ్లు, పుష్పాలతో విశేష అభిషేకాలు చేశారు. కన్నెస్వామితో కలిసి నైవేద్యం సమర్పించిన తర్వాత మహా పడి వెలిగించగా, జ్యోతిరూపుడైన అయ్యప్ప స్వామి తొమ్మిదో మెట్టుపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అయ్యప్ప దీక్ష మాలధారుల అయ్యప్ప నామస్మరణ, భజనలు, కీర్తనలతో పూజా మండపం మార్మోగింది. అనంతరం భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి పరవశించారు. ఈ మహా పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప దీక్షదారులు శ్రీనివాసరెడ్డి, కొండబత్తుల శ్రీధర్, పెరుమాళ్ళ మహేందర్, ఓదెల లక్ష్మయ్య, వినయ్, వడ్డేపల్లి రాజు, ఎరుకొండ మధుకర్, కందగట్ల విజయ్ కుమార్, కొండబత్తుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.


