కాకతీయ, మహబూబాబాద్ టౌన్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అవయవదానం, భావి వైద్యుల పరీక్షల కోసం, పార్థివ దేహాలను మెడికల్ కళాశాలకు అందజేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావడానికి సిద్ధంగా ఉండాలని మహబూబాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బి. వీరన్న బుధవారం పిలుపునిచ్చారు.
రక్తదాన పక్షోత్సవాలలో భాగంగా రక్త, నేత్ర, అవయవ, పార్థివ దేహాల దానంపై మానుకోటలోని హౌసింగ్ బోర్డు కాలనీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమానికి వీరన్న అధ్యక్షత వహించి మాట్లాడుతూ. అలాగే కంటి చూపు సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనే వారికి మరణానంతరం నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికీ కంటి చూపు అందించిన వారవుతారు అని తెలిపారు.
వివిధ రకాల జబ్బులతో అవయవాలు సక్రమంగా పని చేయని వారికి అవయవాలు దానం చేయడం ద్వారా వారికి పునర్జన్మ లభిస్తుందన్నారు. మరణానంతరం కూడా సమాజానికి ఫార్థివదేహం మెడికల్ కళాశాలకు అందించడం వల్ల ,బావి వైద్యులైన మెడికల్ విద్యార్థులకు శవంద్వారా వైద్య విద్య బోధన జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా కాలనీకి చెందిన ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ఎడ్ల వెంకట సాయి వరుణ్ పుట్టినరోజు పురస్కరించుకుని శ్రీనివాస్ యాదవ్ తన మరణానంతరం తన పార్థివదేహాన్ని మహబూబాబాద్ మెడికల్ కాలేజీకి అందించడానికి ముందుకు రాగా ఆయన సతీమణి శ్రీలత అవయవదానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ దంపతుల నుంచి ఆయా దానాల అంగీకార పత్రాలను స్వీకరించారు. ఇంకా కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సభ్యులు అనుమాల వెంకటేశ్వర్లు, క్లబ్ సెక్రటరీ పరకాల రవీందర్ రెడ్డి, మాజీ వార్డు కౌన్సిలర్లు ఎడ్ల రమేష్, ఎడ్ల వేణుమాధవ్, చిట్యాల జనార్దన్, కాలనీ వాసులు గార్లపాటి మహిపాల్ రెడ్డి, మొగిలి వీరారెడ్డి, వీరన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


