- బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
- అంగీకార్- 2025 పోస్టర్ ఆవిష్కరణ
కాకతీయ, వరంగల్ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై- అర్బన్) 2.0 కార్యక్రమంపై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కలిగించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులకు సూచించారు. శుక్రవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా)లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పిఎంఏవై- అర్బన్- 2.0 అవగాహనలో భాగంగా రూపొందించిన అంగీకార్- 2025 పోస్టర్ ను కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పి ఎం ఏ వై- అర్బన్ 2.0లో భాగంగా గతంలో నమోదు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పురోగతిని పరిశీలించాలని, పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు లబ్ధిదారులను గ్రూపులుగా తయారు చేయాలని, పిఎం సూర్య ఘర్ ప్రయోజనాలను లబ్ధిదారులకు మఫ్ట్ బిజిలీ యోజనలో అందించేలా చూడాలన్నారు.
దరఖాస్తుల వేగవంతమైన ధృవీకరణతో పాటు స్పెషల్ ఫోకస్ గ్రూప్ కింద లబ్ధిదారులను చేర్చి వారికి వడ్డీ సబ్సిడీ పథకం (ఐఎస్ఎస్) కింద గృహ రుణాలపై సబ్సిడీని సులభతరం చేయడంపై అవగాహన కల్పించడం, అల్ప ఆదాయ గృహాలకు( క్రెడిట్ రిస్క్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్) గురించి అవగాహన కల్పించాలని పిఎంఏవై- అర్బన్ 2.0 ప్రయోజనాలను బలహీన వర్గాలకు అందించేలా చూడాలని సూచించారు. అలాగే రుణ మేళాల ద్వారా లబ్ధిదారులకు గృహరుణాలు అందించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వరంగల్, హన్మకొండ జిల్లాల హౌసింగ్ పీడీలు గణపతి, హరి కృష్ణ, బల్దియా డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రవీందర్ తో పాటు హౌసింగ్ ప్రత్యేక అధికారులు డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.


