రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు
కాకతీయ, రాయపర్తి : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలను తూచా తప్పకుండా పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య స్పష్టం చేశారు. గురువారం రాయపర్తి ప్రయాణ ప్రాంగణం సమీపంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని వాహనదారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం అంటే కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడం కాదని, అది మన ప్రాణాలను మనమే రక్షించుకోవడమని అన్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా వాహనదారుడికే కాదు, కుటుంబ సభ్యులకు, ఇతరులకు తీరని నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ వినియోగించడం వల్ల ప్రమాద సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందని వివరించారు. సీఐ కొమ్మూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలను వివరించి, మద్యం మత్తులో వాహనం నడపడం ఆత్మహత్యతో సమానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు తుల్ల సంపత్, సుమన్, అనిల్, నవ్యతో పాటు దుకాణదారులు, వాహనదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


