ఎన్నికల అభ్యర్థులకు అవగాహన సదస్సు
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు–2026ను పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 30 వార్డులకు సంబంధించిన 143 మంది అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) జి. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నియమావళి ఉల్లంఘనకు పాల్పడితే SST, VST బృందాల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అభ్యర్థులు ప్రచార సమయంలో రూ.10 వేలకన్నా ఎక్కువ నగదును తమ వద్ద ఉంచుకొని తిరగరాదని, మొత్తం ఎన్నికల వ్యయం గరిష్టంగా రూ. లక్ష వరకు మాత్రమే ఉండాలని, ఆ ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. అలాగే, ఇతర అభ్యర్థుల వాల్ పోస్టర్లపై లేదా ఫ్లెక్సీలపై మరో అభ్యర్థి ఫ్లెక్సీలు అతికించరాదని తెలిపారు.
ఈ సదస్సులో ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వై. మనోహర్, జిల్లా ఆడిట్ అధికారి సయ్యద్ ముసాబ్ అహ్మద్, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఎలక్షన్ అబ్జర్వర్లు మహ్మద్ జలాలోద్దీన్ అక్బర్, ముంజల శ్రీనివాస్, ఎక్సైజ్ శాఖ అధికారి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎస్సై నాయిని అశ్వినీ గాంధీ, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, మాస్టర్ ట్రైనర్ తాళ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


