కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో మాదకద్రవ్య రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు ముమ్మరం అవుతున్నాయి. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని మంగళవారం కాటారం మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో మిషన్ పరివర్తన్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం యువతను, సమాజాన్ని నాశనం చేస్తున్నందున, ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
విద్యార్థులకు మాదకద్రవ్యాల శారీరక, మానసిక, సామాజిక ప్రభావాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగం ఉంటే 100, 14446, 1908 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అదనంగా, మహిళా సాధికారత సిబ్బంది అనూష బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం గురించి విద్యార్థులకు వివరించారు. బాలికల రక్షణ, విద్యా ప్రాముఖ్యత, మహిళా సాధికారతపై చర్చించారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, మహిళా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొని, మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేసి మనం మారుదాం, సమాజాన్ని మార్చుదాం అనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.


