ఎక్స్‌పర్ట్ టాక్‌తో విద్యార్థుల్లో చైతన్యం
కాకతీయ, నెల్లికుదురు : మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ (టీజీఎంఎస్)లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పీఎం శ్రీ నిపుణులతో ఎక్స్‌పర్ట్ టాక్ కార్యక్రమాన్ని శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారం పవిత్ర ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. లక్ష్య నిర్ధారణతోనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, క్రమశిక్షణ, కష్టపాటు విజయానికి మూలమని వివరించారు. పొగతాగడం వల్ల ఊపిరితిత్తులకు కలిగే నష్టాన్ని ప్రత్యక్ష ప్రయోగాల ద్వారా చూపించి, ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. అలాగే బాలికా విద్య, బాలికల సాధికారతపై ప్రత్యేకంగా మాట్లాడి, అమ్మాయిలు చదువుతోనే స్వతంత్రంగా ఎదిగి సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, చైతన్యం పెరిగిందని నిర్వాహకులు తెలిపారు.


