రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన
కాకతీయ, తొర్రూరు : జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా తొర్రూరు పట్టణంలో ఆటో, టాక్సీ, డీసీఎం వాహన డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తొర్రూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ధీరజ్ కుమార్, సీఐ గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అధిక వేగం ప్రాణాలకు ముప్పని హెచ్చరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, వాహన పత్రాలు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు.
బాధ్యతాయుత డ్రైవింగ్‌తోనే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై ఉపేందర్, లాయర్లు రామకృష్ణ, గౌస్, పోలీసు సిబ్బంది, అధికారులు, డ్రైవర్లు పాల్గొన్నారు.


