గుంతలు పూడ్డి.. ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్లు
కాకతీయ, ఖిలావరంగల్ : కరీమాబాద్ నుంచి బట్టల బజారు వైపు వెళ్లే ఫ్లైఓవర్‌పై ఏర్పడిన భారీ గుంతలు రోజురోజుకీ ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం కనిపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల అదే ఫ్లైఓవర్‌పై ఒక ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఇక ఆలస్యం చేస్తే ప్రాణ నష్టం తప్పదని అక్కడి అడ్డా ఆటో డ్రైవర్లు గ్రహించారు. అధికారుల కోసం ఎదురుచూడకుండా, ప్రజల భద్రతే ముఖ్యమని భావించిన ఆటో డ్రైవర్లు స్వయంగా రంగంలోకి దిగారు. అందరూ కలిసి చందాలు వేసుకుని ఇసుక, సిమెంట్, కంకర వంటి నిర్మాణ సామగ్రిని తెప్పించారు. ఫ్లైఓవర్‌పై ఉన్న గుంతలను తమ చేతులతోనే పూడ్చి తాత్కాలికంగా అయినా ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఆటో డ్రైవర్లు తీసుకున్న ఈ ముందస్తు చర్యల వల్ల ప్రస్తుతం ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే వాహనదారులకు ఊరట లభించింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో జరిగే ప్రమాదాల ముప్పు గణనీయంగా తగ్గిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలనే బాధ్యతతో ప్రభుత్వ పనిని తామే చేయాల్సి రావడం బాధాకరమని, అయినా ప్రమాదం జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ పని చేశామని ఆటో డ్రైవర్లు తెలిపారు. వారి సేవా భావానికి స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


