- టీ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్
కాకతీయ, కరీంనగర్ : ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వారికిచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ విమర్శించారు. కరీంనగర్‌లో ఆటో కార్మిక సంఘం నాయకుడు కొత్తూరి రఘుతో పాటు పలువురు సభ్యులు జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా వారికి జాగృతి కండువాలు కప్పి హరిప్రసాద్ ఆహ్వానించి మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదన్నారు.
ఫ్రీ బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, రాపిడో సేవలు వారి జీవనాధారంపై మరింత ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఆటో కార్మిక సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేసి, ప్రతి ఆటో డ్రైవర్‌కు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకపోతే జాగృతి అధ్యక్షురాలు కవిత నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హరిప్రసాద్ హెచ్చరించారు. కార్యక్రమంలో జాగృతిలో చేరినవారిలో ఎండీ హుసైన్, రమేష్, వెంకటేష్, మహేష్, యండి ఖాజా ఉన్నారు. జాగృతి నాయకులు గొల్లపల్లి రత్నాకర్, ఎండీ రాజీ, గర్షకుర్తి విద్యాసాగర్, కొత్వాల అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


