అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
కాకతీయ, గీసుగొండ: అప్పుల బాధ భరించలేక ఆటో డ్రైవర్ ఉరేసుకున్న సంఘటన మొగిలిచర్లలో చోటు చేసుకుంది. గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ మహా నగరపాలక సంస్థ 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామ శివారులోని గోపాల్ రెడ్డి నగర్‌కు చెందిన ఇప్ప నాగరాజు (23) అనే ఆటో డ్రైవర్ ఆదివారం తెల్లవారుజామున ఇంటి ఎదుట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత సంవత్సరం అప్పు చేసి కొత్త ఆటో కొనుగోలు చేసిన మృతుడు కొంతకాలంగా ఆటో సరిగా నడవకపోవడంతో అప్పులు పెరిగి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులు భరించలేక చివరికి మానసికంగా కృంగిపోయి ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య నాగరాణి (21), కుమారుడు సిద్ధు (4) ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సీఐ తెలిపారు.


