గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఆటో డ్రైవర్
10 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం
గంజాయి సరఫరా చేసిన వ్యక్తి పరారీ
కాకతీయ / గీసుగొండ : గంజాయి సేవిస్తున్న వ్యక్తిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎస్‌ఐ కుమార్ తన సిబ్బందితో కలిసి వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ కట్టమల్లన్న గుడి సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను గమనించిన గొర్రెకుంటకు చెందిన ఆటో డ్రైవర్ బండారి క్రాంతి కుమార్ (32) అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అనుమానం కలగడంతో పోలీసులు అతడిని పట్టుకొని తనిఖీ చేయగా, అతని వద్ద ఉన్న కవర్‌లో 10 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. విచారణలో గంజాయిని తిలక్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు క్రాంతి కుమార్ అంగీకరించాడు. బీహార్‌కు చెందిన తిలక్ ప్రస్తుతం ఎన్టీఆర్ నగర్‌లోని మిర్చి మిల్లుల్లో హమాలీగా పని చేస్తున్నాడని తెలిపాడు. గంజాయి సేవించేందుకు అక్కడికి వచ్చినట్లు వెల్లడించాడు. కాగా, తిలక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్రాంతి కుమార్‌పై గతంలో దొంగతన కేసులు కూడా ఉన్నట్లు సీఐ వెల్లడించారు. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకొని మత్తు, మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశారు. మత్తు పదార్థాలపై ఎలాంటి సహనం ఉండదని సీఐ హెచ్చరించారు.


