ఆగి ఉన్న లారీకి ఢీకొట్టిన ఆటో
ముగ్గురికి గాయాలు
కాకతీయ, గీసుగొండ : రోడ్డుపై నిర్లక్ష్యంగా పార్క్ చేసిన లారీని ఆటో ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని సీఐ డి విశ్వేశ్వర్ తెలిపారు. సంగెం మండలం తీగరాజుపల్లి ఫోటో తండాకు చెందిన బానోతు హనుమ, వాసం కృష్ణ, జాటోత్ రవి ఆటోలో వరంగల్ కూరగాయల మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఓంకార్ గార్డెన్ సమీపంలో ఉదయం 4.30 గంటల సమయంలో రోడ్డుపై నిలిపిన లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టారు. లారీ డ్రైవర్ జాగ్రత్తలు తీసుకోకుండా వాహనాన్ని రోడ్డుపై నిలిపివేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం గార్డెన్ ఆసుపత్రికి మార్చారు. ఫిర్యాదుదారు బానోతు వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ డి విశ్వేశ్వర్ తెలిపారు.


