ఆటో–కారు ఢీ
ఒకరి మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
మరిపెడలో ఘోర రోడ్డు ప్రమాదం
సీతారాం తండా సమీపంలో ఘటన
క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమం
కాకతీయ, మరిపెడ : ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరిపెడ మండలం పురుషోత్తమగూడెం శివారు సీతారాం తండా సమీపంలో సూర్యపేట–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పిట్టల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు శుభకార్యం నిమిత్తం ఆటోలో మహబూబాబాద్‌కు వెళ్తుండగా, కొరివి వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రామసాని వెంకన్న (55) అక్కడికక్కడే మృతి చెందారు. పిట్టల శ్రీనివాస్, పిట్టల పద్మ, గాలి అరుణ, గాలి గిరి, కేసరి శేషమ్మ, ఆటో డ్రైవర్ రవీందర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరికి ఎముకలు విరిగినట్లు 108 ఈఎంటి పఠాన్ తెలిపారు. పిట్టల పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను మానుకోట ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.



