కొమ్మాల దేవస్థానంలో ప్రసాద విక్రయాలకు వేలం
వివిధ రకాల వేలాల ద్వారా రూ.9,45,500/- ఆదాయం
గత సంవత్సరం కంటే రూ.1,96,500/- అధిక ఆదాయం
కాకతీయ, గీసుగొండ : మండలంలోని కొమ్మాల గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిర్వహించిన విక్రయ హక్కుల వేలాలు విజయవంతమయ్యాయి. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన వేలాల ద్వారా మొత్తం రూ.9,45,500 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పి.ప్రసాద్ తెలిపారు. గత సంవత్సరం ఆదాయంతో పోలిస్తే ఈసారి రూ.1,96,500 అధికంగా రావడం విశేషమన్నారు. భక్తుల నుంచి మంచి స్పందన, వేలాల్లో పోటీ పెరగడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. వేలాల్లో కొబ్బరికాయల విక్రయ హక్కు ద్వారా అత్యధికంగా రూ.6,07,000 ఆదాయం వచ్చింది. అలాగే కొబ్బరి చిప్పల పోగు హక్కు వేలం ద్వారా రూ.2,82,000, తలనీలాల ద్వారా రూ.31,000, పుట్నాలు, పేలాల విక్రయ హక్కుల ద్వారా రూ.23,500 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం అన్ని విక్రయాల ద్వారా దేవస్థానానికి గణనీయమైన ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారిగా బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఈఓ వై.రత్నాకర్ రెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు కాండూరి రామాచార్యులు, విష్ణు, ఫణీంద్ర, సిబ్బంది ప్రేమ్ కుమార్, వీరస్వామి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.


