- బాలికలపై లైంగిక వేధింపులు చేసినట్లు ఆరోపణలు
- వీడియోలను స్వాధీనం చేసుకోవాలని సీపీకి హోం సహాయక మంత్రి ఆదేశాలు
- విధుల నుంచి వెంటనే తప్పించాలని కలెక్టర్‌కు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాలు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ యాకూబ్ పాషా బాలికల వాషింగ్ రూంలో రహస్యంగా కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటెండర్ యాకూబ్ పాషా బాలికలను లైంగిక వేధింపులకు కూడా పాల్పడినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం సహయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రంగా స్పందించారు.
వీడియోలను స్వాధీనం స్వాధీనం చేసుకోండి : బండి సంజయ్
ప్రభుత్వ పాఠశాల ఘటనపై బీజేపీ నేతలు రంగంలోకి దిగి పోలీసు అధికారులతో మాట్లాడారు. అంతే కాకుండా కేంద్ర హోం సహయశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్సనల్ గా కరీంనగర్ రూరల్ ఏసీపీతో మాట్లాడి నిందితుడిని కఠినంగా విచారించాలని అతని వద్దనున్న వీడియోలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. బాధిత విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు పూర్తి భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు యాకూబ్ పాషాను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
సీరియస్ అయిన ఎమ్మెల్యే..
ఈ ఘటనపై చొప్పదండి నియోజక వర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా తీవ్రంగా స్పందించారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తో ఫోన్లో మాట్లాడి అటెండర్ యాకూబ్ పాషాను వెంటనే విధుల నుంచి తొలగించాలని సూచించారు. ఏడాది కాలంగా వేధింపులు కొనసాగుతూనే ఉన్నా అధికారులు నిర్లక్ష్యం వహించారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో పర్యవేక్షణ బలోపేతం చేయాలని సూచించిన ఎమ్మెల్యే బాధిత విద్యార్థినులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే అటెండర్ పాషాను వెంటనే అరెస్టు చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


