ఇసుక రవాణాపై దాడులు
సీఐ నిరంజన్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ రూరల్: అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. గ్రామాల్లో పెట్రోలింగ్ సందర్భంగా ఇసుక అక్రమ రవాణాను గుర్తించి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. వల్లంపహడ్ గ్రామానికి చెందిన మహేష్ తన యజమాని సందవేణి సంపత్ ఆదేశాల మేరకు ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే చొప్పదండి మండలం చాకుంట గ్రామానికి చెందిన కుడిదల అజయ్, శంకరి శ్రవణ్ ఆదేశాల మేరకు నీరుకుల్లా అనిల్ కుమార్తో కలిసి ఇసుకను అనుమతులు లేకుండా తరలిస్తుండగా పట్టుకున్నారు. మొగ్దుంపూర్ గ్రామానికి చెందిన కళ్ళపల్లి సుధాకర్, మీసాల సాయిలు ఆదేశాల మేరకు ఇసుకను తరలిస్తుండగా జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను సీజ్ చేసి నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


