- గవాయిపై దాడి అంటే రాజ్యాంగంపై దాడినే
- డీఎస్పీ జిల్లా కన్వీనర్ మైదం రవి మహారాజ్
కాకతీయ, ఆత్మకూర్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడి అమానుషమని డీఎస్పీ జిల్లా కన్వీనర్ మైదం రవి మహారాజ్ అన్నారు. భారత రాజ్యాంగ విలువలను అవమానపరిచేవిధంగా సీజేఐ గవాయిపై చేసిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. నిందితుడైన న్యాయవాది రాకేష్ కిషోర్ ను బహిరంగంగా ఉరితీయాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలో డిబీఎఫ్,డిఎస్పీ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మం పేరుతో మతోన్మాద అడ్వకేట్ రాకేష్ కిషోర్ సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే సీజేఐ గవాయ్‌పై పాదరక్ష విసరడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కేవలం వ్యక్తిగత దాడి కాదని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ పునాదులపై జరిగిన దాడి అని తెలిపారు. ఈ ఘటన వెనుక హిందూ మతోన్మాద శక్తుల హస్తం స్పష్టంగా కనిపిస్తోందని సంఘ్ పరివార్ ఆశ్రయంతో బీజేపీ వీరిని పెంచిపోషిస్తోందని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని తామే కాపాడుతున్నామని చెప్పుకునే బీజేపీకి సిగ్గుచేటని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్, డిబీఎఫ్ జిల్లా నాయకుడు మోరే ఐలయ్య, నాయకుల సంగే నాగరాజు, తనుగుల ప్రభాకర్, తంగెళ్లపెళ్లి మహేందర్, కొమ్ము చిన్ని, జన్నారపు బిక్షపతి తదితరులు పాల్గోన్నారు.


