కాకతీయ, ఇనుగుర్తి : భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై దాడి హేయమైన చర్య అని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పప్పుల వెంకన్న, ప్రధాన కార్యదర్శి మహంకాళి రామ్ సలీం లు అన్నారు. దాడికి యత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో వారు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నిందితుడైన న్యాయవాది చిత్రపటానికి నిప్పంటించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దాడికి పాల్పడిన న్యాయవాది ఆర్ఎస్ఎస్ వాది అని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. సీజేఐ గవాయ్ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్న న్యాయవేత్త అని, అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తున్న ఆయనపై మతోన్మాదుల దాడి హేయమన్నారు. ఈ దాడి దళితులు, వెనుకబడిన వర్గాలపై ఉన్న ద్వేషానికి ప్రతీక అన్నారు. సదరు న్యాయవాదికి కఠిన శిక్ష పడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


