పెళ్లి వేడుకలో దారుణం
పాత కక్షలతో వరుస బావపై దాడి
అడ్డుకున్న వ్యక్తి దారుణ హత్య
కాకతీయ, పెద్దపల్లి : పెళ్లి సంబరాలు జరగాల్సిన చోట ఒక్కసారిగా రక్తపాతం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య పాత కక్షలు చెలరేగడంతో వరుసకు బావ అయిన వ్యక్తిపై దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి అడ్డుపడిన వ్యక్తిని కత్తితో దారుణంగా హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే మొలుగూరి కొమురయ్య (58), ఆయన తమ్ముడు సత్యనారాయణ తమ అక్క కూతురు వివాహం సందర్భంగా శనివారం సెంటినరీ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌కు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఇదే సమయంలో గతంలో ఏర్పడిన పాత కక్షలతో వరుసకు బావ అయిన మొలుగూరి సత్తయ్యపై దాడి చేయడానికి బుర్ర రాజకొమురయ్య ప్రయత్నించాడు. అయితే ఈ ఘటనను అడ్డుకునేందుకు ముందుకొచ్చిన అన్న మొలుగూరి కొమురయ్యపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో కత్తిపోట్లకు గురైన కొమురయ్య అక్కడికక్కడే కుప్పకూలి తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. ఘటన అనంతరం నిందితుడు బుర్ర రాజకొమురయ్య పరారైనట్లు సమాచారం. మృతదేహాన్ని సెంటినరీ కాలనీ డిస్పెన్సరీకి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఈ హత్య ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.


