ఆసంగిలోను ఆసామికి తప్పని తిప్పలు
*యూరియా బస్తాల కొరతతో రైతుల అగచాట్లు
కాకతీయ,గీసుగొండ: యూరియా బస్తాల తీవ్ర కొరతతో ఆసంగి పనుల్లో ఉన్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. పంటలకు అత్యవసరమైన సమయంలో యూరియా అందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.మండలంలోని ఊకల్ హవేలీ గ్రామ పంచాయతీ ఆవరణలో,ధర్మారం నగరపాలక సంస్థ కార్యాలయంలో యూరియా కోసం రైతులు తెల్లవారు జామునుంచే చలిని కూడా లెక్కచేయకుండా బారులు తీరారు.వ్యవసాయ కేంద్రాల్లో పరిమితంగా యూరియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో గంటల తరబడి నిరీక్షించినా చాలా మందికి యూరియా లభించని పరిస్థితి నెలకొంది. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నా ఒక రేషన్ కార్డుకు ఒక్క యూరియా బస్తానే ఇవ్వడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అవసరానికి సరిపడా యూరియా అందకపోతే పంటల పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
*రైతులకు సరిపడ యూరియా అందిస్తాం..
గీసుగొండ తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్..
రైతులకు యాసంగి పంటల అవసరమైన యూరియాను సరిపడా అందించడానికి అధికారుల సమన్వయంతో పనిచేస్తామని అన్నారు.ఊకల్ హవేలీ గ్రామంలో బారులు తీరిన రైతుల కార్డులు తీసుకొని వరుస క్రమంలో ఒక్కొక్కరిని పిలిచి ఎకరానికి ఒక యూరియా బస్తా చొప్పున రాసామని ఆది, సోమవారం రోజుల్లో ఊకల్ రెవెన్యూ పరిధి రైతులకు యూరియా అందిస్తామని తెలిపారు.


